గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెం గ్రామంలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. రంగురంగుల ముగ్గులతో గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కీర్తన ప్రథమ బహుమతిగా 6 గ్రాముల బంగారు నాణెం, వైష్ణవి ద్వితీయ బహుమతిగా 5 గ్రాముల బంగారు నాణెం, మంగ తృతీయ బహుమతిగా 3 గ్రాముల బంగారు నాణెం గెలుచుకున్నారు. విజేతలకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా టీడీపీ మహిళా జనరల్ సెక్రటరీ సాయి కళ్యాణి మిల్సురి, పబ్లిక్ స్పీకర్ కృష్ణప్రియ అడుసుమల్లి పాల్గొని ముగ్గులను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. గోపాలపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కాకర్ల రామ తులసి ఆధ్వర్యంలో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ మహిళలలో దాగి ఉన్న సాంస్కృతిక ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
0 కామెంట్‌లు