అన్ స్టాపబుల్ ఎమ్మెల్యే కు అన్లిమిటెడ్ ఆఫర్స్ అంటున్న పట్టాభిరామ్
ద్వారకాతిరుమలలో రూ.50 లక్షల గోబర్ధన్ ప్లాంట్ ప్రారంభం
పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం అంటున్న మద్దిపాటి
ద్వారకాతిరుమల,ఏప్రిల్ 21: ద్వారకాతిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వి త్రినాధరావు, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వేదపండితులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వేదాశీర్వచనం మండపంలో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించారు.
ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ యండి బి.అనిల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ కూచిపూడి ఉదయభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన గోబర్ధన్ ప్లాంట్‌ను చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ప్లాస్టిక్ రహిత వాతావరణం, వ్యర్థాల నుంచి సంపద సృష్టి లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ద్వారకాతిరుమల ఆలయంలో ఏర్పాటైన గోబర్ధన్ ప్లాంట్ ద్వారా సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులుగా మారుస్తామని చెప్పారు. దీని ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు శుభ్రమైన శక్తి ఉత్పత్తి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షల మేరకు స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా ఇలాంటి గ్రీన్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ గోబర్ధన్ ప్లాంట్ ద్వారా వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని, స్థానికంగా శుభ్రత మెరుగుపడుతుందని తెలిపారు. పునర్వినియోగ శక్తి ఉత్పత్తికి ఇది దోహదపడుతుందని, గ్రామీణ అభివృద్ధికి ఉపయోగకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, ఆలయ అధికారులు, జిల్లా అధికారులు, వేదపండితులు, గోపాలపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు


0 కామెంట్‌లు