అమ్మ ఏమి ఇచ్చి నీ ఋణం తీర్చుకోగలను...
అమ్మా...
వేవిళ్ళతో అమ్మ కడుపులోకి చేరి, నవమాసాలు తరువాత అత్యద్భుతమైన ప్రపంచాన్ని చూసే మహత్తరమైన అందమైన అవ కాశాన్ని ప్రకృతిచే సృష్టింపబడిన భగవంతుని ప్రతి రూపమైన మాతృ మూర్తి ద్వారా పొందిన మనందరము ఏమిచ్చి అమ్మ ఋణం తీర్చుకోగలము?
అప్పుడప్పుడు అలసిన నా మనసు వేదనపడుతున్న సమ యంలో నీతో చెప్పుకునే అవకాశములేని క్షణాలయినాయని అల్లాడి పోతున్న నాకు తరతరాలకు మారనిది అమ్మ ప్రేమలోని మాధుర్యమే అని, తియ్యనైన పదం అమ్మ అనే తలంపువచ్చి, మనసు కాస్త ఊరట చెందుతున్న వేళ ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలనమ్మా....
నా మనసులోని భావాలను వ్యక్తీకరించుట అవసరమయిన అక్షర జ్ఞానాన్ని పొందుటకు కారణభూతురాలవు నీవే అన్న సత్యాన్ని ఎన్నటికీ మరువని నేను ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలనమ్మా.... తెలిసో, తెలియకో నీ మనసును నొప్పించిన నన్ను దగ్గరకు తీసుకొని నీ అంతులేని ఆప్యాయతతో మధురమైన మాటలతో నన్ను క్షమించి, పిల్లలపట్ల తల్లి మనసు ఎలా ఉంటుందో తెలియ చెప్పిన నీకు ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలనమ్మా.....
బిడ్డల యొక్క ఇష్టాయిష్టాల గురించి వారు ఆనందంగా ఉండాలంటే ఏమి చెయ్యాలో కన్నతల్లికి తెలిసినంతగా ఎవరికీ తెలియని, ఆ తల్లి గురించి మనకు ఎంత వరకు తెలుసు అని. ప్రశ్నించుకుంటే, ఏమీ తెలియని నేనే ఏమిచ్చి నీ ఋణం తీర్చుకో గలనమ్మా....
సనాతన సాంప్రదాయాలను ప్రతిబింబింప చేసే బొమ్మల పెళ్ళిళ్ళు, సంధ్య గొబ్బెమ్మ ఆటలు, వాటిలోని అంతరార్ధాలను వివరించి నేర్పిస్తూ నీవు పొందిన సంతోషం, నీకళ్లల్లో కనిపించిన ఆనందం నాకింకా జ్ఞాపకమే, అటువంటి అపురూపమైన జ్ఞాపకాన్ని నాకు మిగిల్చిన నీకు ఏమిచ్చి నీ ఋణం తీస్చుకోగలనమ్మా...
అధునాతన కాలంలోని విద్యలలో కూడా మాకు ప్రవేశాన్ని కల్పించి, సంగీత సాహిత్యల్లో కూడా నన్ను ప్రోత్సహించి మురిసిన నీకు ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలనమ్మా...
నీగురించి ఎంతో చెప్పాలని మనసు ఆరాటపడుతున్నా, నువ్వంటే ఏమిటో తెలుపుట నాకున్న భాషాపరిజ్ఞానం సరిపోవటం లేదు, కానీ, నాకు జన్మ అంటూ మళ్ళీ ఉంటే నీకు అమ్మగా పుట్టి, నీవు మా పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను మళ్ళీ నీకు వంచి, కొంచమయినా నీ ఋణం తీర్చుకోవాలని నా మనసు ఆశపడుతున్నది.
Source from
- తల్లాప్రగడ ఇందిరాశారద


0 కామెంట్‌లు