ద్వారకాతిరుమల, మార్చి8 న్యూస్: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం చెలికానివారి పోతేపల్లి గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ కోదండరామాలయం నేడు(మార్చి 8, 2026) ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. గ్రామస్థుల భక్తిశ్రద్ధలతో ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామ చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన పాత శ్రీ కోదండరామాలయం 1935 సంవత్సరంలో మొదటిసారిగా నిర్మించబడింది. దశాబ్దాలుగా భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన ఈ ఆలయం కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో, గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి పాత ఆలయాన్ని తొలగించి అదే ప్రదేశంలో ఆధునిక సౌకర్యాలతో నూతన ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
భక్తుల సహకారంతో నిర్మాణం పూర్తికాగా, 2026 సంవత్సరంలో ఆలయాన్ని మళ్లీ ప్రతిష్ఠాపన చేయడం గ్రామానికి ఆనందకరమైన ఘట్టంగా నిలిచింది. రేపు ఉదయం ఆదిదేవుడు సాక్షిగా, పంచభూతాల సాక్షిగా వేద మంత్రోచ్ఛారణల మధ్య నూతన శ్రీ కోదండరామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, కలశ ప్రతిష్ఠ, ధ్వజారోహణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులందరికీ భారీ అన్నసమారాధన (అన్నదానం) కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ మహోత్సవానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ కోదండరామ స్వామి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు ఆహ్వానం పలికారు.
0 కామెంట్‌లు